అర్థం – పర్థం 700

రచన: డాక్టర్ కర్రి రామారెడ్డి

కర్రి రామారెడ్డి డాట్ కాం

కుక్క వేషం వేసి మొరగనన్నట్టు

కుక్క, వేషం, మొరగడం ఈపదాలకు విశేషార్థాలు ఏమీలేవు. సాధారణమైన అర్థాలే! దీనిని లోకోక్తిగా ఎలా వాడతారు అన్నది పరిశీలిద్దాం.

ఒక ఊహ

అది ఒక వినోదవిహారవనస్థలి Amusement Park. అక్కడకు వచ్చే పిల్లలకు వినోదం పండించడానికి ఎలుగుబంటి, కుందేలు, బఫూన్ లాంటివేషధారులతోపాటు కుక్క వేషధారి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసారు. ఆర్థికమాంద్యం కారణంగా ఆయన ఉద్యోగం ఊడింది. మళ్ళీ కొత్తకొలువు కుదిరేవరకూ, ఖాళీగా ఉండడమెందుకని ఈ ఉద్యోగంలో చేరాడు. నెలాఖరున యజమానులు జీతంలో కోత వేసారు. ఎందుకంటే, కుక్కవేషం బాగానే వేసాడుగానీ మొరగమంటే బిడియపడుతున్నాడు, సిగ్గంటున్నాడు. ఏదైనా పనిలోనికి దిగేటప్పుడు, ముందూ వెనకా, మంచీచెడ్డా అన్నీ ఆలోచించే దిగాలి. ఒకసారి దిగినతర్వాత దానిలో పరిపూర్ణంగా లీనమవ్వాలి అంతేగానీ అరకొరగా చేస్తానంటే కుదరదు.

** కొన్ని సందర్భాలు**

పొట్టిబట్టలు వేసుకోనంటావ్! హీరోను ముద్దుపెట్టుకోవడం కుదరదంటావ్! డైరెక్టరు గారు గెస్ట్‌హవుస్‌కు రమ్మంటే వెళ్ళవు! అసలు ఈఫీల్డుకు ఎలా వచ్చావమ్మా! అని పరిపూర్ణతకు వక్రభాష్యం చెప్పే కొందరు సినీ మాయలోళ్ళు.

నాకెందుకో ఆవిషయం తలుచుకుంటేనే కంపరమెత్తినట్టుంటుంది. మనం మంచి స్నేహితుల్లా, మంచి రూంమేటుల్లా ఎందుకు జీవితాన్ని ఆనందించకూడదూ. అనే కొత్త పెళ్ళికూతురు.

స్వీయ అనుభవం

బాబోయ్, జలగ పేరెత్తితేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిది దాన్ని పట్టుకుని, సాగదీసి, పిండి, డిసెక్షన్ చెయ్యడమా! నావల్లకాదు, నాకీ డాక్టరు చదువొద్దు బాబోయ్, పోతాను. నా MBBS ఫస్టియర్‌లో బయాలజీ.