గోదారిగట్టు
రచన: ప్రభాకర్ పెదపూడి
కోటిపల్లి గోదారి గట్టు మీద ఉదయం, సాయంత్రాలు జనంతో సందడే సందడి. ముక్తేశ్వరం నుంచి వచ్చే లాంచీలు జనాన్ని కోటిపల్లి రేవులో దింపేసి కాసేపాగి జనాల్ని ఎక్కించుకుని ముక్తేశ్వరం ఎల్లిపోతూ ఉంటాయి. లాంచీలు దిగిన జానాలతో గోదారి గట్టు బిలబిల లాడిపోతూ ఉంటాది. చాలా ఏళ్ళమట్టీ వెంకటేశం అనే ముసలి ఆంబోతు రేవులో తిరుగుతూ, జనాలుపెట్టే ఆరటిపళ్లు, పండు తినేసి విసిరేసే తొక్కలు తినటం, ఆదమరచి ఉన్నోల్ల చేతుల్లోవి లాక్కోవడం లాంటివి చేస్తూ ఉంటుంది.
గులాబీరావు గులాబ్జాములు అమ్ముకుంటాడు. కోటిపల్లి రేవులో ఓపెద్దసైజు గాజుసీసానిండా పంచదారపాకంలో గులాబ్జాములతో పూర్వకాలంనాటి రావిచెట్టుకింద కూర్చుంటాడు. అమ్మకాలు జరిగినప్పుడు పొరపాటున కిందకుజారే పంచదార పాకం చుక్కల గురించి కొండంత ఆశతో నల్లకుక్క ఒకటి నాలుక జాపుకుని ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయంనుంచి సాయంత్రం వరకు అది అక్కడే ఉంటుంది. అలా చాలాకాలం నుంచీ ఉంటోంది. అప్పుడప్పుడూ కస్టమర్లు పడేసిన పేపరుప్లేటులు మెరిసేలా నాకేసి అది తృప్తి పడుతుంది.
సాయంత్రం ఆరింటికల్లా గొట్టం రాంబాబు సరిగ్గా రావిచెట్టుకి కొంత దూరంలో కూర్చుని చుట్టవెలిగిస్తాడు. వాడి ఊపిరితిత్తులు పొగపట్టేసి ఇటుక బట్టీలా ఉన్నాయని తాగటం మానకపోతే వచ్చే ఏడాదికి నువ్వు ఉండవు అని ముక్తేశ్వరంలో ఉండే ఆరెంపీ డాట్రోరు ఆరేళ్లక్రితం గొట్టం రాంబాబు పెళ్ళానికి పదేపదే చెప్పారు. ఐనా ఈడు చుట్ట పీల్చటం మానడు, ఆల్లు చెప్పటం మానరు. గొట్టం రాంబాబు గురించి ఎవరైనా అడిగితే రావిచెట్టుకి అసింటా చుట్టపీకల గుట్ట ఉంటుంది దానెనకాల ఆడుంటాడు అని వేళాకోళంగా అంటారు అక్కడోళ్ళు. బాగా పోద్దోయాక నీరసంగా లేచి, నాలుగు గులాబ్జాములు తినేసి ఇంటికి చేరుకుంటాడు గొట్టం రాంబాబు.
సూరిమావ నీరసంగా గోదాట్లోకి మునిగాడు, చంద్రమ్మామ ఉషారుగా వంటినిండా వెన్నెలపావుకుని గోదాట్లోంచి పైకొచ్చాడు. పిచ్చకొట్టుడు పరమేశం గట్టుకి దూరంగా ఉన్న కల్లుపాకలోకి నిటారుగా దూరి, తూలుకుంటూ బయటకొచ్చి కాసేపు తూలి తూలి సోలిపోయాడు. పగలంతా గట్టుమీద తిరిగి తిరిగి అలసిపోయిన చిన్నపాటి రౌడీ రమణ కాళ్ళు జాపుకుని మర్రిచెట్టు మొదట్లో బోర్లా పడుకుని గట్టుమీద పొలంపన్లు చేసుకుని ఇంటికి చేరుకునే ఆడోళ్ళని అదోలా చూస్తున్నాడు.
సమయం తొమ్మిది. ఆఖరి లాంచీ కొద్దిపాటి జనంతో కోటిపల్లి చేరుకుంది. రిక్షా నడుపుకునే ముసలోడు ఇద్దరినీ ఎక్కించుకుని తొక్కలేక తొక్కుకుంటూ ఊర్లోకి ఎల్లిపోయాడు. గులాబీరావు గులాబ్జాముల ఖాళీ సీసాని గోదాట్లో కడిగేసి ఇంటికెళ్లిపోయాడు. నల్లకుక్క వెనకాలే నడిచింది. గొట్టం రాంబాబు ఆఖరి చుట్ట పీకని విసుగొచ్చి కిందపడేసి, దగ్గుకుంటూ ఇంటిదారి పట్టాడు. అంతవరకూ అక్కడే పడుకున్న ఆంబోతు వెంకటేశం ఊర్లోకి వెడుతున్న ఆవు వెనకాల పడింది. మత్తు దిగుతున్న పిచ్చకొట్టుడు పరమేశం పెళ్ళాం వస్తున్న అలికిడి విన్నాడేమో గబగబా ఇంటికి పరుగెట్టాడు. గోదారి గట్టు ఈరోజు ఇలా, మర్నాడు మరోలా నిండుగా గమ్మత్తుగా ఉంటుంది