నాలుగు తరాలుగా హోటలంటే అలా ఉండాలి ఆ ఊరెడితే అక్కడ తిని తీరాలనే సంస్థలు నడిపిన మా కుటుంబం వ్యాపారంలోనే కాదు ఆదర్శాల్లోనూ పెద్దపీటే. స్వాతంత్ర్యసమరయోధులు, గాంధేయవాదులు. చదువు చదువుకోసమే ఉద్యోగం చెయ్యడానిక్కాదు అనేకమందికి ఉపాధి కల్పించడానికని నమ్మి నాకిష్టమైనవి చదివించినందుకు పుస్తకాల పురుగయ్యి ఆ వ్యాపారమే వదిలింతర్వాత మూడొందల అరవయ్యైదు రోజులూ, రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యాపకంలోంచి విడుదలయ్యాను. అమ్మ ఊహ ఎరిగి విశ్రాంతి తీసుకోవడం ఎరగను. పదో ఏట నుంచీ అందరికీ హోటల్ పనిలో శిక్షణ.

నేను టీజర్ చూసే చెప్పాను. ఇది జాతీయాంతర్జాతీయ చిన్నపిల్లల 3D గేమ్ంగ్ సినిమా. అనేక భాషల్లో సబ్‍టైటిల్సొస్తాయి. వాళ్ళ పిల్లలకి రామాయణం ఇలా చూపిస్తే నచ్చుతుందని కాస్మోపోలిటన్, మెట్రోపోలిటన్ నగరాల్లో పిల్లలతో నిండిపోతుంది. తప్పదు కదా తల్లులూ తండ్రులూ ఇలా బాగోలేదలా బాగోలేదని విసుక్కుంటూ చూస్తారు. లిటిల్ సోల్జర్ సినిమా సమయంలోలా ఆన్లైన్ టికెటింగ్ లేకపోయుంటే ఈ నెగెటివి రివ్యూలవాళ్ళని నిజంగా ఇళ్ళకెళ్ళి మరీ బాదేద్దురు పిల్లలు.

నేను నా జీవితంలో అతి తక్కువ నాస్తికులని చూసాను. నిజానికి మనలో ఎక్కువమంది హేతువాదులం. అంటే ఏదైనా సహేతుకమైన ఋజువు చూపిస్తే దైవాన్ని నమ్ముతాం. ఐతే ఇక్కడే ఒక ప్రతిబంధకం ఉంది. దైవం అని ఎవరైనా నిర్వచించినదాన్ని వ్యతిరేకించడం వేరు. తమకంటూ దైవం అంటే ఇలా ఉంటాడనుకుని ఊహించుకొని అది లేదు అనుకోవడం. నాకు ఎదురైన నాస్తికులనేకులు ఈ కోవకే. వీళ్ళు దేవతలని లేరంటుంటారు. దేవతలకీ దైవానికీ వ్యత్యాసం కూడా తేడా తెలియదు. మనకి మనవే ఓ టాగ్ తగిలించేసుకుంటాం. మనం కంటికి కనపడని ఓ దేవతని మొక్కేసుకుని అడిగిందిచ్చేయకపోతే వాడు లేనట్టే. ఇది తికమక నాస్తికత్వం. దెయ్యాలున్నాయో లేదా సందేహం వస్తే కొన్ని చోట్లున్నాయి. అక్కడకి తీసుకెళ్ళి ఓ గంట పట్టపగలే ఒంటరిగా వదిలెస్తే బతికి బట్టకట్టేవాళ్ళతి కొద్దిమంది. మనం ఇక్కడ మన మూడ్‍ని బట్టి రాసేస్తుంటాం. మనకో భజన సంఘం ఉంటుంది ఏది రాసినా జయహో అని లైకులు కొట్టడానికి కానీ కొందరు పనిగట్టికుని మనవి చదువుతారు. లైకులు కొట్టరు కామెంట్లు పెట్టరు. అన్‍ఫ్రెండ్ చెయ్యరు. కానీ ద్వేషిస్తారు. వాళ్ళ వ్యక్తిగత కారణాలేవో ఉంటాయి. మనం చీకట్లో పాము తోక తొక్కినట్టు ఎప్పుడో ప్రత్యక్షంగానో పరోక్షంగా వాడికి తగుల్తాం. వీళ్ళే మనని హింసిస్తారు. నిజానికి మనకి ఇక్కడ మనం అనుకున్నంత భావప్రకటనకి స్వేచ్చ ఉండదు. జాగ్రత్త.

నిజానికి ఈ టీచర్లని శిక్షించాల్సిందే. స్కూల్లో పిల్లలకి ఆసక్తికరంగా పాఠాలు చెప్పలేకపోయినందుకు. ఒక ట్రైబల్ స్కూల్లో కంప్యూటర్ ఫాకల్టీ దొరికేవారు కాదు. నేను యోగసాధన చేసే ఆశ్రమ స్కూలది. ఒకవేళ ఎవరైనా దొరికినా ఆశ్రమ వాసనలబ్బినవాడు కనుక పిల్లలకి నీతులు తెగచెప్పేసి బాగుచేసేద్దామనుకునేవాడు. అసలే ఆ పిల్లలు బండోళ్ళు. ఇంట్లో వీళ్ళ అల్లరి పడలేక ఏం చెయ్యాలో తెలియక చింతబరికలూ వాతల్తో పనికాక ఇంక అంతకన్నా కొడితే ఛస్తారేమో అని కనీసం హాస్టల్లో పారేస్తేనన్నా బాగుపడతారేమో అని మనసు చంపుకున్న తల్లితండ్రుల పిల్లలు. టీచర్లని కూడా రాళ్ళతో కొట్టేసి వాళ్ళ రూములకి బయట తాళాలేసేసి హింసించి తమ రూముల్లో బలహీనుల్ని బానిసలుగా వాడేసుకున్న రాక్షసమూక. కానీ నాకు పిల్లలంటే నాకిష్టం. యోగసాధనకి పట్టే సమయం ఆరే గంటలు. మిగిలిన సమయం అంతా ఆశ్రమం ఆఫీసు, స్కూల్ ఆఫీసు, సాయంకాలం మాత్రం హాస్టల్ పిల్లలకి బోధన. స్కూల్లో చెప్పడానికి సరిపడా కంప్యూటర్లూ లేవు. లాబ్‍ కోసం స్థలమూ లేవు. అన్నిటి కన్నా ఆ ఎయిడెడ్ స్కూల్లో మాస్టర్లకే కంప్యూటర్ రాదు. వచ్చినా అదేం వాళ్ళకి ఆదాయం పెరగదు. అందువల్ల అసలు ఆసక్తి ఉండదు. సిలబస్సే కవర్ చెయ్యలేకపోతున్నాం అని ఆయాసపడే టీచర్లు. ఇక కంప్యూటర్ క్లాసుకేం పంపుతారు. ఈ ధోరణి చాలా స్కూళ్ళలో చూసా. పెద్దపెద్ద కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళతో సహా. వాళ్ళ దృష్టిలో కంప్యూటరంటే ప్రోగ్రామింగ్, ఫారిన్ ఉద్యోగాలు,బోలెడు జీతాలు తప్ప ఒక గ్రామంలో అమ్మ, నాన్న కుటుంబం అంటే ప్రేమ ఉన్నవాడికి వాళ్ళని వదలకుండా ఖాళీ సమయాల్లో ఆదాయం సంపాదించే వ్యాపకం ఇవ్వగల అద్భుతయంత్రం కాదు.

మొత్తానికి హాస్టల్ పిల్లలకి నేను కొన్నేళ్ళ కంప్యూటర్ బోధనానుభవంతో నేను అనుకున్న విధానంలో నేర్పడం మొదలుపెట్టాను. ముందుగా కంప్యూటర్లో గేమ్సెలా ఆడాలో నేర్పాను. హఠాత్తుగా కంప్యూటర్ క్లాసంటే దొరక్కుండా పారిపోయి క్రికెట్ ఆడుకునే పిల్లల్లో ఒక్కొక్కడూ రావడం మొదలుపెట్టారు. తర్వాత పిల్లల వరద. నాకు ఆరో క్లాసు నుంచి ఎనిమిదో క్లాసు పిల్లల్నే అప్పచెప్పారు. మిగిలినవాళ్ళకి కంప్యూటర్ అనవసరం అనీ కంప్యూటరంటే పెదోళ్ళకే అని అక్కడి యాజమాన్యం ఉద్దేశ్యం. నేనైతే ఒకటో క్లాసు కాదు ప్రీ ప్రైమరీ పిల్లలకి కూడా చెప్పచనే ఉద్దేశ్యం. వాదనలకి అవకాశం లేదు. ముందు అంతమందికి చెప్పడానికి కంప్యూటర్లు లేవు. సమయమూ లేదు. మెల్లగా పిల్ల కాలువ లాంటి అటెండెన్స్ వరదలా మారింది. చిన్న పిల్లలు కూడా మాక్కూడా చెప్పరా మాస్టారూ అని ఎగబడడం మొదలుపెట్టారు. వాళ్ళకి చేరిన వార్తలేవిటంటే మాస్టారు నీతులు చెప్పరు నిద్ర రాదు. గేమ్స్ ఆడిస్తారని. నిజానికి నేను ఆడించే గేమ్స్ ప్రత్యేకంగా పిల్లలకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ స్పెల్లింగ్ వచ్చేలా చేసేది. దీని వల్ల వాళ్ళకి తెలియకుండా ఫొనెటిక్ కీబోర్డ్, స్పెల్లింగ్, వచ్చేసాయి. దానివల్ల వాళ్ళకి క్లాసుల్లో మాస్టర్ల దగ్గర ప్రశంసలు దక్కాయి. ఇది ఆశ్రమనిర్వాహకులకి చేరాయి. ఇలా పిల్లకి నవ్వుతూ ఆడిస్తూ చెప్పడం నాకిష్టం.

ఏదైనా పని మనం చేస్తూ భాధ్యత అనుకుని భారం మోస్తున్నాననుకోడం కాకుండా ఆసక్తిగా ప్రేమగా చెయ్యాలి. అలా చెయ్యనివాళ్ళు శిక్షార్హులే.