నేనూ నా ఇంటర్నెట్టూ మొదటి భాగం.

నేను ఈమెయిల్ ఐడీ సృష్టించుకోవడానికి పదిహేనురోజులు పట్టింది. అది పంతొమ్మిదివందల తొంభైతొమ్మిది మాట.

ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్లో గంటకి వందరూపాయలు. ఊళ్ళో మొట్టమొదట ఒకే ఒకటీ బాగా టెక్నాలజీ తెలిసినబ్బాయి ప్రారంభించాడు. అప్పట్లో అలాంటిది పెట్టాలంటే కంప్యూటర్ ఇంజనీరయ్యుండాలి. రోజూ నెట్‍కేఫ్‍కి వెళ్ళడం. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఫాం తెరవడం. అది సగం తెరుచుకుని మధ్యలో ఆగిపోవడం. మళ్ళీ తెరవడం. మళ్ళీ ఆగడం. గంట ఐపోయింది కనుక వెనక చాలా మంది ఎదురుచూస్తూ ఉండడం వల్ల మరుసటిరోజు రావడం. నాషాపు మధ్యాహ్నం మూసి ఆ సెంటరుకి వెళ్ళడం ఒక పక్షంరోజు యజ్ఞం. మొత్తానికి సాధించాను. ఇంతకీ ఆ రోజుల్లో ఈమెయిలెవరికీ అవసరం లేదు. హాట్‌మెయిల్లో మొదటి ఐడీ. చాలా మెల్లగా లోడయ్యేది. బీఎస్‍ఎన్నెల్ తప్ప దిక్కులేదు. ఇంటర్నెట్ స్పీడ్ 4KBPS ఆరు కంప్యూటర్లకి పంపకం. తర్వాత సత్యం కంప్యూటర్స్ వాళ్ళు వచ్చి సూపర్‍స్పీడ్ ఇచ్చారు. అంటే 6KBPS. యాభైశాతం ఎక్కువ. ఇప్పుడు మనకి 100 Mbps అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఇంట్లో ఇరవైనాలుగ్గంటలూ ఇంటర్నెట్ వాడితే ముఫ్పైఐదువేల రూపాయలు. ఇప్పటి విలువ దరిదాపులో మూడులక్షలు. హెచ్సీఎల్ వాళ్ళు షేర్మార్కెట్ వాళ్ళకోసం, ఇంజనీరింగ్ కాలేజీలవాళ్ళకోసం 8 KBPS కనక్షన్లిచ్చేవారు. సెటిలైట్ కనక్షన్ సంవత్సరానికి నాలుగులక్షలు. ఇప్పటి ధరల్లో ముప్ఫైరెండు లక్షలు. ఐనా ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో ఉన్న చాల పెద్ద వ్యాపారాస్తులు బీఎస్‍ఎన్నెల్ కనక్షన్ పెట్టుకుని నెలకొ ఐదువేల బిల్లు కడుతూ ఉండేవారు. నిమిషానికి ఒక యూనిట్ ధర రూపాయ పావలా. అదీ కాక గంటకి పది రూపాయలు ఇంటర్నెట్ చార్జిలు. కేబుల్ ఇంటర్నెట్ చాలా సంవత్సరాల తర్వాత 2006 లో వచ్చింది. 8KBPS నెలకి ఆరువందల యాభై రూపాయలు. ఊళ్ళో మొదటి పదిమందిలో నేనొకణ్ణి. ఇంతిలా ఉండగా 1999 లోనే ఇంటర్నెట్లో క్లాసులు చెప్పిన ఘనత నాకుంది. ఇంట్లోనుంచి కాదు. వ్యాపారం చేసే స్థలం ఖాళీ చేయవలసి రావడం వల్ల వేరే షాపు తీసుకోవడానికి ఇవ్వవలసిన పగిడీ (గుడ్‍విల్ ) ఇవ్వలేక ఖాళీగా ఉండి విదేశాలకి వెడదామని ఉద్యోగావకాశాల కోసం పరిశోధనకి ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రయత్నాలు. అవి రాలేదు గానీ కొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ప్రూఫ్ రీడింగ్ లాంటివి దొరికాయి. కొన్ని స్వచ్చందంగా చేసాను ఇవన్నీ ఒక నెట్‍కేఫ్‍లో అసిస్టెంట్‍గా చేరిపోయి కాలక్షేపానికి బ్రౌజింగ్ చేస్తుంటే దొరికిన అవకాశాలు. ఇంట్లో నెట్ కనక్షన్ పెట్టుకునేంత్ స్తోమత లేదు. అక్కణ్ణుంచీ మొదలయ్యింది. ఇంటర్నేట్లో తవ్వకాలూ. ప్రాజెక్టులూ. సంపాదన. ఇక్కడితో ఇది సరి. ఇంకోసారి మిగిలినది. :)